Sun Dec 01 2024 14:15:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పవన్ కళ్యాణ్-చంద్రబాబు అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు
Claim :చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారనే ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదు.
Fact :వైఎస్ జగన్ సమాధానం చెప్పిన వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ తీరం నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని పవన్ ఆరోపిస్తున్నారు. దీంతో పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు.తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సయయంలోనే, జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. సీజ్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాలు ఉండాలంటూ ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి వెనక్కి వెళ్లిందని, పాలనను సీఎం చంద్రబాబు గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి 150 రోజుల పాలన ఏపీ ప్రజల భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఐదేళ్లు కాదు దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఈ అసెంబ్లీ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో స్పందించకుండా వెళ్లిపోయారంటూ పలువురు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో వైఎస్ జగన్ మీడియాకు రిప్లై ఇచ్చారు.
వైరల్ క్లిప్ కు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. YSR Congress Party అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసిన లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోను మేము గుర్తించాం. అందులో నిడివి ఎక్కువగా ఉంది.
వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు 02:06:57 వద్ద మొదలై, టైంస్టాంప్ 02:07:25 వద్ద ముగుస్తుంది.
జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెప్పారు. "ఎవరు సీఎంగా ఉంటారో వాళ్లు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు వాళ్లను ఆశీర్వదించడాన్ని బట్టి ఉంటుంది. అంతకు మించి ఇంకేమీ ఉండదు" అని వైఎస్ జగన్ చెప్పి ప్రెస్ మీట్ ను ముగించారు. ఆ తర్వాత లేచి వెళ్లిపోయారు.
వైరల్ వీడియోలో జర్నలిస్టు ప్రశ్న అడిగే వరకూ ఉంచారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమాధానం చెప్పిన వీడియోను కట్ చేశారు. చివరగా వైఎస్ జగన్ లేచి వెళ్లిపోవడాన్ని అందులో చూపించారు.
వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారంటూ నవంబర్ 20, నవంబర్ 21 తేదీల్లో తెలుగు న్యూస్ వెబ్ సైట్స్ కూడా కథనాలను ప్రచురించాయి. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలసి వచ్చిన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక అసెంబ్లీలో ప్రతి పక్ష హోదా కావాలని వైసీపీ డిమాండ్ చేయగా అందుకు అసెంబ్లీ స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్లలో కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ వస్తున్నారు. పలు ప్రెస్ మీట్లలో కూటమి ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలపై వైఎస్ జగన్ తన స్పందనను తెలియజేసారు.
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
News Summary - Fact check YS Jagan answered the question about Pawan Kalyan saying Chandrababu naidu will be cm for next 10 years
Claim : చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారనే ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదు.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story