schema:text
| - Fri Feb 14 2025 14:41:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత ప్రధాని మోదీతో షేక్ హ్యాండ్ చేయకుండా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ వెళ్లిపోయారనేది నిజం కాదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పారిస్లో జరిగిన AI సమ్మిట్కు సహ అధ్యక్షత వహించారు.
Claim :
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయలేదుFact :
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది, వీడియో చిత్రీకరణకు ముందు ఇద్దరు నాయకులు ఒకరినొకరు పలకరించుకున్నారుభారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పారిస్లో జరిగిన AI సమ్మిట్కు సహ అధ్యక్షత వహించారు. ప్యారిస్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి భారతీయ సమాజం నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తూ పలకరించారు, పలువురితో కరచాలనం చేశారు.
ప్రధాని మోదీ ఫిబ్రవరి 10, 2025న పారిస్ చేరుకున్నారు. AI సమ్మిట్కు ముందు ఎలిసీ ప్యాలెస్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన స్వాగత విందుకు హాజరయ్యారు. విందుకు చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆయనకు సాదరంగా కౌగిలించుకుని స్వాగతం పలికారు. విందు సందర్భంగా, AI సమ్మిట్ కోసం ఫ్రాన్స్లో ఉన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ను కూడా మోదీ కలిశారు.
పారిస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి AI యాక్షన్ సమ్మిట్కు మోదీ అధ్యక్షత వహించారు. సమ్మిట్ సందర్భంగా, విశ్వాసం, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ సిస్టమ్ల ఆవశ్యకతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తోందన్నారు. మానవతా విలువలను నిలబెట్టే పాలనను, ప్రమాణాలను సాధించేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తదుపరి సమ్మిట్ను భారతదేశంలో నిర్వహించేందుకు కూడా ఆయన ప్రతిపాదించారు.
"ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పారిస్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయలేదు" అనే క్యాప్షన్తో వీడియోను షేర్ చేస్తున్నారు.
“French president Emmanuel Macron didn't shake hands with PM Modi despite being attempted multiple times by him. This is a blatant disregard of PM at the world forum.” అంటూ మరికొందరు పోస్టు పెట్టారు. మోదీ కరచాలనం చేయడానికి చేయి చాపినా కూడా మాక్రాన్ పట్టించుకోలేదని, ఇది మోదీకి అవమానం అని అందులో తెలిపారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఈవెంట్ కు సంబంధించి మరిన్ని వీడియోలను గురించి తనిఖీ చేసాము. వైరల్ వీడియో క్లిప్ నిజమైనది, ఎడిట్ చేయలేదు, అయితే అక్కడ చోటు చేసుకున్న పూర్తి విజువల్స్ ను చూపలేదని తెలుస్తోంది. పారిస్లో జరిగిన AI సమ్మిట్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, భారత ప్రధాని మోదీ ఇద్దరూ సహ అధ్యక్షత వహించారు. కాబట్టి, వారిద్దరూ కలిసి వేదిక పైకి ప్రవేశించారు. తరువాత మాక్రాన్ అప్పటికే వేదిక వద్ద ఉన్న ఇతర నాయకులను పలకరించడం ప్రారంభించారు. వారి మధ్య ప్రధాని మోదీ ఉన్నారు.
Xలో అప్లోడ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఇక్కడ ఉంది, ఇందులో ప్రధాని మోదీ, మాక్రాన్ కలిసి వేదిక మీదకు ప్రవేశించడం, ఇతరులను పలకరించడం చూపిస్తుంది.
Desh Gujarat అనే ఎక్స్ హ్యాండిల్ లో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాం. “Watch | PM Modi and French President Emmanuel Macron arrive for AI Action Summit at Grand Palais in Paris” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు.
నిజానికి, ప్రధాని మోదీ పారిస్ చేరుకున్న తర్వాత ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు చాలాసార్లు కౌగిలించుకున్నారు. AI సమ్మిట్ వేదిక వద్ద ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనంతో అభివాదం చేస్తున్న చిత్రాలను ప్రధాని మోదీ స్వయంగా పంచుకున్నారు, మరొక చిత్రం వారు భవనంలోకి కలిసి నడుస్తున్నట్లు చూపిస్తుంది.
“Welcome to Paris, my friend @NarendraModi! Nice to meet you, dear @VP Vance! Welcome to all our partners for the AI Action Summit. Let’s get to work!” అంటూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 11, 2025న భారత ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ వీడియోను షేర్ చేశారు.
ఫిబ్రవరి 11, 2025న ఫస్ట్పోస్ట్ ప్రచురించిన ఈ వీడియోలో, పారిస్కు భారత ప్రధాని వచ్చిన తర్వాత ఇరువురు నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మనం చూడవచ్చు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయకుండా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ వెళ్లిపోయారనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో చిత్రీకరణకు ముందు ఇద్దరు నాయకులు ఒకరినొకరు చాలాసార్లు కలుసుకున్నారు. పలకరించుకున్నారు. ఇద్దరూ కలిసి వేదిక వద్దకు చేరుకుని శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు.
Claim : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయలేదు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story
|