schema:text
| - ఫ్యాక్ట్ చెక్: నగర పరిధుల్లో హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ఏ కోర్టు అదేశించలేదు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. పోలీసులు తనిఖీ చేస్తూ చలానాలు విధిస్తున్నా, లైసెన్సు
Claim :
ఏదైనా నగరానికి 15 కి.మీ పరిధిలో హెల్మెట్ వినియోగించాల్సిన అవసరం లేదుFact :
ఈ వాదన అబద్దం, హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ఏ కోర్ట్ ఆదేశాలు ఇవ్వలేదుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. పోలీసులు తనిఖీ చేస్తూ చలానాలు విధిస్తున్నా, లైసెన్సులు రద్దు చేస్తాం అంటున్నా సరే కొంతమంది నిర్లక్ష్యం తగ్గడం లేదు. హెల్మెట్ ధరించని వాహనదారులకు, మార్చ్ ఒకటో తారీకు నుంచీ చలానా వెయ్యి రూపాయలకి పెంచారు. అవసరం అయితే, లైసెన్సు కూడా రద్దు చేస్తారు.
ఇంతలో, ఏదైనా నగరానికి 15 కి.మీ పరిధిలో హెల్మెట్ వినియోగించాల్సిన అవసరం లేదు అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా వినియోగదారుడు okaru, వీడియో ని X ప్లాట్ ఫారం పైన "హెల్మెంట్ పై కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం 👌👌👌" అనే క్యాప్షన్ తో షేర్ చేసారు. ఆ వీడియో లో న్యూస్ కి సంబంధించిన బ్రేకింగ్ ప్లేట్లను చూడొచ్చు. అందులో 'నగర పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చును. సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్కు హెల్మెట్ వాడకం తప్పనిసరికాదు. మీ రక్షణ మీ ఇష్టం. రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని అడిగితే.. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది. నగరం వెలుపల 15 కిలోమీటర్లలోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగటానికి లేదు. ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి.. తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయండి'అని ఉండడం చూడొచ్చు.
క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఏ నగరానికి అయినా 15 కి.మీ పరిధిలో హెల్మెట్లు ఉపయోగించాల్సిన అవసరం లేదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందనేది అబద్దం. ఈ వీడియో పాతది. భారతదేశంలోని ఏ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
మొదటగా, 2020లో పిఐబి ఫ్యాక్ట్ చెక్ వారు ప్రచురించినపోస్ట్ లభించింది. అందులో ఈ వాదన అబద్దం అని వారు పేర్కొన్నారు. నగరంలో 15 కిలోమీటర్ల పరిధిలో వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదంటూ వాట్సాప్లో వైరల్గా అవుతున్న సందేశం నకిలీదని ట్వీట్లో పేర్కొన్నారు.
1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ చట్టానికి అనేక సవరణలు చేయబడ్డాయి. దీనికి చేసిన తాజా సవరణ 2019లో జరిగింది, సెక్షన్ 129 ప్రకారం, 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా సరే బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరైనా ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు పట్టుబడితే, సెక్షన్ 194డ్ నేరస్థుడికి ₹1000 జరిమానా విధించాలి. అదనంగా, వారి డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు.
ఆంధ్ర జ్యోతి లో ప్రచురించిన కధనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు అమలుచేయడంలో పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నొక్కిచెప్పింది. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని పోలీసులను ప్రశ్నించింది. నిబంధనల అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపించాలని, పోలీసులు రోడ్ల మీదకు వచ్చి వాహన రికార్డులు తనిఖీ చేసినప్పుడే అది సాధ్యపడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీసీ కెమెరాలపై ఆధారపడి చలాన్లు విధించడాన్ని తగ్గించి, పోలీసులు రోడ్లపై నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధించి అక్కడికక్కడే వసూలు చేస్తే రెండునెలల్లో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది. పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్ చర్యలు కూడా తగ్గుతాయని పేర్కొంది.
టైంస్ ఆఫ్ ఇండియా కధనం ప్రకారం, గత ఐదు నెలల్లో, సెప్టెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు, వైజాగ్లో హెల్మెట్ లేకుండా బైక్లు నడిపినందుకు 26,500 మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేశారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సిబ్బంది, వైజాగ్ నగర పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై, ముఖ్యంగా హెడ్గార్డ్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై దాడిని ముమ్మరం చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల సాధారణ ఈ-చలాన్తో పాటు, ఉల్లంఘనుల డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. ఇదిలా ఉండగా, 2024లో వైజాగ్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల జాబితాలో హెల్మెట్ లేకుండా వాహనం నడపడం అగ్రస్థానంలో ఉంది.
ఈ కధనం ఇంతకు ముందు 2022 సంవత్సరంలో కూడా వైరల్ గా షేర్ అయ్యింది. అప్పుడూ, తెలుగుపోస్ట్ ఈ వాదన ను పరిశీలించి తప్పు అని తేల్చింది.
కనుక, నగరంలో 15 కిలోమీటర్ల పరిధిలో హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదనే వాదన అవాస్తవం. అటువంటి చట్టం ఏదీ లేదు, ఏ న్యాయస్థానం దీనికి సమ్మతి ఇవ్వలేదు. దేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు, ఇతరులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
|