Wed Jan 29 2025 14:30:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలి చనిపోలేదు
తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్
Claim :తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలి చనిపోయారు
Fact :ఆయన చనిపోలేదు. తిరిగి విధుల్లో కొనసాగారు
జనవరి 26న దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. కేరళపై ముఖ్యమంత్రి పినరయి విజయన్కు స్పష్టమైన విజన్ ఉందని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అన్నారు. ముఖ్యమంత్రి వేదికపై ఉండగానే గవర్నర్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. కేరళ రాష్ట్ర అద్భుతమైన పురోగతిని ప్రశంసించారు. కేరళ రాష్ట్ర అధిక అక్షరాస్యత రేటును, వివిధ రంగాలలో గణనీయమైన పురోగతి గురించి ప్రశంసలు కురిపించారు. ఈ విజయాలు రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రజల సమిష్టి కృషిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ ఉండగా ఓ పోలీసు అధికారి పడిపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలి చనిపోయారు..." అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ పోస్టును ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ చనిపోలేదు.
వైరల్ వీడియోలో తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ ఊహించని విధంగా అందరి ముందూ కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు ఆయన్ను లేపడానికి ప్రయత్నించడం చూడొచ్చు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఆయన కళ్లు తిరిగి పడిపోయారు తప్పితే చనిపోలేదని ధృవీకరిస్తూ కథనాలను ప్రచురించాయి.
"City police commissioner collapses during Governor's Speech at Republic Day parade" అంటూ కేరళ కౌముది వెబ్ సైట్ లో కథనాన్ని చూశాం.
https://keralakaumudi.com/en/news/news.php?id=1468953&u= లింక్ లో కథనాన్ని చూడొచ్చు.
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో నగర పోలీస్ కమిషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలారు. పరేడ్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కమీషనర్ గవర్నర్ దగ్గర నిలబడి ఉన్నారు. వివిధ సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ ప్రసంగం చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో గవర్నర్ సమీపంలో నిల్చున్న కమిషనర్ కుప్పకూలిపోయారు. ఆయన ముందుకు పడిపోయారు. ఆయన్ను వెంటనే అతని సహచరులు అంబులెన్స్ వద్దకు తీసుకుని వెళ్లారని, చికిత్స అనంతరం ఆయన తిరిగి వచ్చారని కథనంలో ఉంది.
City Police Commissioner faints at Republic day event in presence of Kerala Governor అంటూ మరో మళయాళ న్యూస్ పోర్టల్ మాతృభూమి కూడా 26 జనవరి 2025న కథనాన్ని పోస్టు చేసింది.
వేదిక సమీపంలో ఉన్న అంబులెన్స్లో అధికారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించారు. అవసరమైన వైద్య సహాయం పొందిన తరువాత, కమిషనర్ జోస్ వేదిక వద్దకు తిరిగి వచ్చారు. ఎలాంటి సమస్యలు లేకుండా పరేడ్ కొనసాగిందని కథనం తెలిపింది.
ఇదే విషయాన్ని పలు నేషనల్ మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. ఆయన లో బీపీ కారణంగా కుప్పకూలిపోయారని, గుండెపోటు కాదని కూడా కథనాలు తెలిపాయి. రక్తపోటు తగ్గడంతో కమిషనర్ కుప్పకూలిపోయారని, ఆ రోజు కమీషనర్ అల్పాహారం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఉదయం నుంచి పరేడ్ గ్రౌండ్స్లోనే ఆయన ఉన్నారు. ఆయనకు ప్రాథమిక వైద్య సహాయం అందించారని, ఆయన బాగానే ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపినట్లు పలు నివేదికలు ఉన్నాయి.
వైరల్ పోస్టులను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
రిపబ్లిక్ డే రోజున తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలి చనిపోలేదు. ఆయన బ్రతికే ఉన్నారు. పలు మీడియా సంస్థలు కూడా ఆయన బాగా ఉన్నారని ధృవీకరించాయి.
కాబట్టి, వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
News Summary - Fact Check: Thiruvananthapuram City Police Commissioner Thomson Jose did not died
Claim : తిరువనంతపురం సిటీ పోలీస్ కమీషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలి చనిపోయారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story