schema:text
| - ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీ బాయి అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు
వైరల్ ఫోటోలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీ బాయి
Claim :
వైరల్ ఫోటోలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీ బాయిFact :
వైరల్ ఫోటోకు, ఝాన్సీ లక్ష్మీబాయికి ఎలాంటి సంబంధం లేదు1857-58లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకురాలు, 'ఝాన్సీ కి రాణి'గా ప్రసిద్ధి చెందిన రాణి లక్ష్మీ బాయి శౌర్యానికి పర్యాయపదంగా నిలిచారు. బ్రిటిష్ సైన్యం 1858లో ఝాన్సీని ముట్టడించింది. లక్ష్మీబాయి తన సైన్యంతో బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా భీకర పోరాటం చేశారు. అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి బ్రిటిష్వారి వెన్నులో వణుకు పుట్టించారు. నడుముకు తన దత్తపుత్రుడుని కట్టుకుని శత్రువులపై పోరాటం చేశారు. రెండు వారాల హోరాహోరీ యుద్ధం అనంతరం బ్రిటిష్ సైన్యం ఝాన్సీ రాజ్యాన్ని కైవసం చేసుకుంది. శత్రు మూకల తాకిడి ఎక్కువవ్వడంతో 50 అడుగుల కోట గోడ దూకి శత్రువుకు చిక్కకుండా తప్పించుకుంది. గ్వాలియర్ చేరుకుని స్వతంత్ర పోరాటంలో తన సహచరులైన నానా సాహెబ్ పీష్వా తదితరులను కలుసుకుంది. శత్రువులు అక్కడికీ రావడంతో ఆమె వారికి చిక్కకూడదని రణరంగం నుంచి తీవ్రగాయాలతో బాబా గంగదాస్ ఆశ్రమం చేరుకుంది. బ్రిటిష్ వారికి తన శవం కూడా చిక్కకూడదని స్వామీజీతో చెప్పి ప్రాణాలు వదిలింది.
లక్ష్మీబాయి చూపిన ధైర్యం, పరాక్రమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో మహిళా విభాగానికి ఝాన్సీ రెజిమెంట్అని పేరు పెట్టారు.
ఝాన్సీ లక్ష్మీ బాయికి సంబంధించిన అసలైన ఫోటో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"ఇప్పటివరకు మనం ఝాన్సీరాణి గారి చిత్రాన్ని పుస్తకాల్లో స్కెచ్ లేదా క్యాన్వాస్ మీద బ్రష్తో వేయటం పరిపాటే. కానీ భారత్ లో ఆమె అసలైన చిత్రాలను మీరు ఇప్పటివరకు చూడకపోవచ్చు. అవును ఝాన్సీ రాణి గారు 1850లో తీయించుకున్న ఈ ఫోటో ఇప్పుడు బయటపడింది. ఆంగ్లేయ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇది. ఫోటోగ్రాఫర్ పేరు హాఫ్మేన్" అంటూ పోస్టు వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
పలు భాషల్లో ఈ ఫోటోను వైరల్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఫోటోలో ఉన్నది ఝాన్సీ లక్ష్మీ బాయి అన్నదానికి ఆధారాలు కూడా పూర్తిగా లేవు.
వైరల్ పోస్ట్లో ఉన్న ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు భారతదేశంలో ఫోటోగ్రఫీ 1840లో మొదలైనప్పటికీ, వితంతువు అయిన ఝాన్సీ రాణి కూర్చున్న విధానంపై పలువురు చరిత్రకారులు అనుమానాలు వ్యక్తం చేశారు. భారతీయ స్త్రీలు అటువంటి భంగిమలతో అప్పట్లో ఫోటోలు దిగడం అనుమానమేనని అన్నారు. 1850లో 'హాఫ్మన్' తీసిన వాస్తవ ఛాయాచిత్రం భిన్నమైనదని పలువురు ఆరోపించారు. ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి నిజమైన ఫోటో వాస్తవికతను ధృవీకరించడానికి ఏ నిపుణులు కూడా లేరు.
మాకు లభించిన మరిన్ని ఫలితాలలో యూట్యూబ్ వీడియో కూడా ఉంది.
Picture of "Jhansi Ki Rani" clicked by Hoffman found అనే టైటిల్ తో 23 ఆగస్టు 2012న ఏబీపీ న్యూస్ లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాం.
భోపాల్కు చెందిన వామన్ ఠాక్రే అనే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో ఫోటోను ప్రదర్శించినట్లు వీడియోలో నివేదించారు. వామన్ ఠాక్రే తన స్నేహితుడు అమీత్ అంబాలాల్ నుండి ఫోటోను 1,50,000 రూపాయలకు కొనుగోలు చేసానని చెప్పాడు. ఫోటో వెనుక దేవనాగరి, ఉర్దూలో ఝాన్సీ కి రాణి పేరు ఉందని తెలిపారు.
2010 సంవత్సరంలో ప్రచురించిన వార్తా కథనాల ప్రకారం, ఝాన్సీ కి రాణి అసలు ఫోటోపై కొన్ని సందేహాలు ఉన్నాయి. Gyandotcom అనే వెబ్సైట్ ఈ చిత్రాన్ని ఆమె ఏకైక 'అసలు' ఛాయాచిత్రం అని పేర్కొనడంతో వివాదం చుట్టుముట్టిందని ఒక వార్తా కథనం చెబుతోంది. అది 1850లో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ హాఫ్మన్ ద్వారా క్లిక్ చేయబడింది. 'ది వార్ ఆఫ్ 1857' రచయిత అమరేష్ మిశ్రా మాట్లాడుతూ, తన పుస్తకం కోసం పరిశోధన చేస్తున్నప్పుడు తాను ఈ ఫోటోను చూడలేదని లేదా దాని గురించి వినలేదని అన్నారు. అంతేకాకుండా హాఫ్మన్ గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదని చెప్పారు.
రేర్ బుక్ సొసైటీ ఆఫ్ ఇండియా 02 అక్టోబరు 2011న పోస్ట్ చేసిన ఒక కథనంలో ఝాన్సీ రాణి ఫోటోగ్రాఫ్ మిస్టరీ ఛేదించారని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ చూడొచ్చు.
చరిత్రకు సంబంధించిన అనేక వాస్తవాలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి, కానీ అవి సరైనవి అనే క్లారిటీ ఇప్పటి వరకూ లేదు. ఇదే ఝాన్సీ లక్ష్మీ బాయి విషయంలో కూడా జరుగుతూ ఉంది.
ఈ ఫోటో ఝాన్సీ లక్ష్మీ బాయికి సంబంధించినదే అనే క్లారిటీ ఇచ్చే సాక్ష్యాలు మాకు లభించలేదు.
|